పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని విస్సాకోడేరునుంచి దక్షిణ భారత దేశ యాత్రకు బస్సు బయలుదేరింది. ఇందులో భాగంగా కేరళలోని శబరిమలకు వెళుతుండగా మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 11మంది తెలుగువారు మృతి చెందారు.
ఈ టూరిస్ట్ బస్ శబరిమల వెళుతుండగా ఎరిమేరి ప్రాంతంలోని పంబా లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మరో నలభైమంది గాయపడ్డారు.
వీరిలో ఇరవైమంది పరిస్థితి విషమంగావుందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక కొట్టాయం మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ఇరుకుగా ఉండటం, వెలుతురు సరిగా లేకపోవటంతో బస్ అదుపు తప్పి లోయలోకి పడటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. మరణంచినవారిలో ఎక్కవగా మహిళలు, చిన్న పిల్లలే ఉన్నట్లు సమాచారం.
ఇదిలావుండగా ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు శబరిమల ఆలయ బోర్డు లక్షరూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. కొట్టాయం జిల్లా కలెక్టర్ వేణు పర్యవేక్షణలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. |