జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామిపై కోడిగుడ్లతో దాడి చేసిన కేసును చెన్నై నగర పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ దాడికి సంబంధించి 14 మందిపై కేసు నమోదు చేశారు. గత మంగళవారం జరిగిన దాడికి సంబంధించి బుధవారం రాత్రి కొంతమంది లాయర్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వీరిని ఏడో మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరుచగా, 15 రోజుల జుడిషియల్ కస్టడీకి తరలిస్తూ మేజిస్ట్రేట్ రవి ఆదేశించారు.
ఒక కేసు నిమిత్తం మద్రాసు హైకోర్టుకు హాజరైన సుబ్రహ్మణ్య స్వామిపై సాక్షాత్ న్యాయమూర్తి సమక్షంలోనే ప్రాక్టీస్ న్యాయవాదులు కొందరు కోడిగుడ్లతో దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ కేసును సుయోమోటోగా స్వీకరించిన హైకోర్టు, కేసు నమోదు చేయాల్సిందిగా నగర పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో నగర పోలీసులు 14 మందిపై కేసు నమోదు చేయగా, వీరిలో 14 మంది మహిళలు ఉన్నారు.
ఈ కేసులో మూడో నిందితుడిగా భావిస్తున్న న్యాయవాది జిని లియో ఇమ్మాన్యుయేల్‌ను అరెస్టు చేశారు. అంతేకాకుండా స్వామిపై జరిగిన దాడి సమయంలో కోర్టు ప్రాంగణంలో ఉన్న అసిస్టెంట్ పోలీసు కమిషనర్ ఖదర్ మొహిదీన్ కూడా ఫిర్యాదు చేశారు. కొంతమంది న్యాయవాదుల గ్రూపు కోర్టులోకి ప్రవేశించి స్వామిపై దాడి చేసినట్టు కమిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద ప్రాక్టీస్ న్యాయవాదులపై కేసులు నమోదు చేశారు.
ఇందులో 307 (హత్యాయత్న కేసు) కూడా ఉంది. కాగా, పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో మొదటి నిందితురాలిగా రజని, రెండో నిందితుడిగా విజయేంద్రన్, ఏ-3గా లియోలతో సహా పుగళేంది, వడివంబాల్, సెండోది, కయాల్విళిలు ఉన్నారు. కాగా, తనపై దాఖలైన కేసులను విచారించేందుకు గాను స్వామి స్వయంగా కోర్టుకు హాజరై, తన తరపున స్వయంగా వాదించుకుంటారు. |