కేంద్రంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రభుత్వంపై సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ శుక్రవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీబీఐ సాయంతో తనను జైలుకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందనీ ఆయన ఆరోపించారు.ఎటావాలో చరణ్ సింగ్ పీజీ కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ములాయం మాట్లాడుతూ... భారత్ అమెరికా అణు ఒప్పందంపై సంక్షోభం నెలకొన్న సమయంలో.. బయటినుంచి తాము మద్ధతు ఇచ్చిన ప్రభుత్వమే.. ఇప్పుడు తనను జైలుకు పంపే ప్రయత్నంలో బిజీగా ఉందని ఆరోపణాస్త్రాలు సంధించారు.అయితే ఈ విషయం గురించి తమ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ తెలుసుకున్నారని, ఇతరుల ఆస్తిని తనకు చెందినట్లుగా ఎలా పేర్కొన్నదీ ఆయన ఇప్పటికే గ్రహించారని ములాయం వ్యాఖ్యానించారు. కేంద్ర విదేశాంగ విధానాన్ని కూడా ఈ సందర్భంగా ములాయం తప్పుబట్టారు.కేంద్ర అనుసరిస్తున్న విదేశాంగ విధానం వల్ల... ప్రపంచస్థాయిలో భారత్ ఏకాకి అయ్యిందని ములాయం పేర్కొన్నారు. రైతుల గురించి ప్రస్తావించిన ఆయన... రైతులకు అందజేస్తున్న సబ్సిడీలను నిలిపివేసే ప్రయత్నాలను కూడా ప్రభుత్వం మమ్మురం చేసిందని విమర్శించారు. |