మంగళూరు పబ్ దాడి వివాదంపై జాతీయ మహిళా సంఘం (ఎన్‌సీడబ్యూ) సభ్యురాలు నిర్మల వెంకటేశ్‌ను ప్రభుత్వం శుక్రవారం తొలగించింది. శ్రీరామ సేన కార్యకర్తలు ఇటీవల మంగళూరులోని ఓ పబ్‌పై దాడి చేసి, మహిళలతోపాటు, అందులోనివారిపై వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే పబ్‌పై దాడికి సంబంధించిన కేసును నిర్మల నేతృత్వంలో జాతీయ మహిళా సంఘం విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి నిర్మల వెంకటేశ్ సమర్పించిన నివేదిక బాధితులను వ్యతిరేకంగా ఉండటం, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుకా చౌదరికి అసంతృప్తి కలిగించింది.
అంతకుముందు ఈ నెల ప్రారంభంలో నిర్మలా సమర్పించిన నివేదికను అంగీకరించరాదని జాతీయ మహిళా సంఘం కూడా నిర్ణయించింది. పబ్‌పై దాడి జరిగిన వారం తరువాత నిర్మాల సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భద్రతపరమైన లోపాలను ఎత్తిచూపారు.
అనంతరం దీనికి సంబంధించి ఆమె జాతీయ మహిళా సంఘానికి నివేదిక సమర్పించారు. తాజాగా ఈ నివేదికను జాతీయ మహిళా సంఘం సమావేశంలో నిశితంగా పరిశీలించారు. దీనిని అంగీకరించరాదని నిర్ణయించినట్లు ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్ గిరిజా వ్యాస్ తెలిపారు.
అనవసర విషయాలపై నిర్మల తన నివేదికలో దృష్టిసారించారని, అదే సమయంలో అవసరమైనవాటిని పట్టించుకోలేదని చెప్పారు. ఈ పబ్‌కు లైసెన్స్ ఉందా లేదా అనే విషయాన్ని నిర్మలా నేతృత్వంలోని బృందం నివేదికలో లేవనెత్తింది. అసలు సంగతి ఇది కాదు. పబ్‌పై దాడికి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు నివేదిక కోరాము.
దీనికి సంబంధించిన విషయాలను వదిలిపెట్టారని వ్యాస్ పేర్కొన్నారు. నిర్మలా నేతృత్వంలోని బృందం పబ్ యజమాన్యం బాలికలకు సరైన భద్రత కల్పించలేదని కూడా పేర్కొంది. ఈ నివేదికను ఆధారంగా చేసుకొని నిర్మల వెంకటేశ్‌ను తాజాగా ప్రభుత్వం జాతీయ మహిళా సంఘం నుంచి తొలగించింది. |