ములాయంతో ఉత్తరప్రదేశ్ ఎన్నికల పొత్తుకు కాంగ్రెస్ పార్టీ 99శాతం కట్ కొట్టినట్లు తెలుస్తోంది. ములాయం సింగ్ లేకుండానే యూపీలో 24 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడం దీనికి మరింత ఊతమిస్తోంది.
తొలుత ఎన్నికల వేళ ఇరు పార్టీలు జట్టుకట్టి యూపీలో పోరు సాగించాలని అనుకున్నాయి. కానీ మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా సమాజ్‌వాదీ పార్టీ క్రమంగా కాంగ్రెస్‌కు దూరమైంది. మరోవైపు ఎస్పీ కల్యాణ్ సింగ్‌ను ఆహ్వానించడం కాంగ్రెస్‌కు కోపాన్ని తెప్పించింది. దీంతో ఇరు పార్టీల మధ్య అగాధం ఏర్పడింది. ఇదిలా ఉండగా తాము ఎస్పీని ప్రక్కన పెట్టడానికి సమాజ్‌వాదీ పార్టీ కుళ్లు రాజకీయాలే కారణమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు ఆరోపించారు. 80 స్థానాలకు గాను 64మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ద్వారా కాంగ్రెస్‌ను చిన్నచూపు చూసిందన్నారు. ఇటువంటి భిన్నాభిప్రాయాలకల పార్టీతో సహజీవనం సాధ్యం కాదని తెలిపారు. సోనియాతో జరిగిన పొత్తు చర్చల్లో ములాయం పట్టువిడుపు లేకుండా ప్రవర్తించారని దుయ్యబట్టారు. అధిక స్థానాలను తమకే కట్టబెట్టాలని ములాయం మంకుపట్టు పట్టడంతో పొత్తు సాధ్యపడలేదని వెల్లడించారు.
కాగా ఇప్పటికే హేమాహేమీలు బరిలో ఉన్న కాంగ్రెస్ నియోజకవర్గాలను తమకే కట్టబెట్టాలన్న ములాయం గొంతెమ్మ కోరికపై సోనియా అసంతృప్తి ఫలితంగా పొత్తు బెడిసికొట్టిందని సమాచారం. |