ప్రచారంలో ఎప్పుడూ కొత్త పుంతలు తొక్కే భారతీయ జనతాపార్టీ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి కూడా సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా... భారతీయ జనతాపార్టీ యువజన విభాగం "అద్వానీ ఎట్ ద రేట్ ఆఫ్ క్యాంపస్" అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది.ఈ కార్యక్రమంలో భాగంగా... భాజపా అధ్యక్షుడు ఎల్.కె అద్వానీ దేశంలోని ఐఐఎంలను, ఇతర ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌ను సందర్శించి తమ పార్టీ విధానాలు, ప్రణాళికను వివరించి యువ ఎంబీఏల మద్ధతును కోరతారు. పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తమ పార్టీ గెలిచినట్లయితే చేసే పనులను ఆయన వివరిస్తారు.ఈసారి ఎన్నికల్లో యువత అధికంగా ఓటర్ల లిస్టులో ఉన్నందువల్ల భాజపా యువజన విభాగం ఈ "అద్వానీ ఎట్ ద రేట్ ఆఫ్ క్యాంపస్" కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా అద్వానీ ఆర్థిక మాంద్యాన్ని నివారించేందుకు, మరిన్ని ఉద్యోగాల కల్పనకు తీసుకోబోయే చర్యలు తదితర విషయాల గురించి వివరించనున్నారు. అలాగే సుపరిపాలన, తీవ్రవాద నిరోధక చర్యల గురించి కూడా అద్వానీ ప్రసగించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. |