బీజేపీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు లెఫ్ట్ కూటమిపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సమంజసంగా లేవని, ఆయన తన నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దన్ హితవు పలికారు. ఇది ఆయన స్థాయికి తగదని బర్దన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఏఐవైఎస్ఎఫ్ యూత్ పార్లమెంట్ సమావేశాల ప్రారంభానంతరం విలేకరులతో మాట్లాడుతూ...బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడి లెఫ్ట్ కూటమిపై చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగ్గట్టు లేవని ఆయన పేర్కొన్నారు.కాగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు కలలు కంటున్నారని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఎన్నికలలో సామాన్యులు పోటీ చేసే పరిస్థితి లేదని అర్థికంగా అంగబలంవున్నవారే రాజకీయాలలో పోటీ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ శక్తిని అధికారంలోకి తెచ్చే బాధ్యత ప్రస్తుతం యువతపైనే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందులో మూడో ప్రత్యామ్నాయ కూటమిదే తగిన బాధ్యతగా ఆయన అభివర్ణించారు. |