ఒరిస్సా రాష్ట్రంలో అధికారం బిజూ జనతాదళ్, భారతీయ జనతా పార్టీ స్నేహబంధానికి తెరపడింది. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కిరాకపోవడంతో బీజేడీకి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకోవాలని భాజపా నిర్ణయించింది. ఫలితంగా 11 సంవత్సరాల స్నేహబంధం తెగిపోయింది. సీట్ల పంపిణీపై శనివారం ఇరు పార్టీల నేతల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో ఒరిస్సా ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ భాజపాతో పొత్తు ముగిసిందని ప్రకటించారు.
దీంతో ఆగ్రహించిన భాజపా, నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలిసి మద్దతు ఉసంహరణ లేఖను అందజేయనున్నారు. కాగా, సీట్లు సర్దుబాటుపై బీజేపీ ఫార్ములా ఆమోదయోగ్యం కాదని అందువల్ల ఎన్నికల్లో బీజేడీ, బీజేపీ వేర్వేరుగా పోటీ చేస్తాయని నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
దీనికి ప్రతిగా ఒరిస్సాలో బీజేడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు భాజపా ప్రకటించింది. ఈ రెండు పార్టీలు 1998, 1999, 2004లలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో, 2000, 2004లో జరిగిన ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోటీ చేశాయి.
147 స్థానాలుగా గల ఒరిస్సా అసెంబ్లీలో గత ఎన్నికల్లో బీజేడీ 84, బీజేపీ 63 స్థానాలకు పోటీ చేయగా, ఈ సారి తమకు 100కు పైగా స్థానాలు కావలసిందేనని బీజేడీ పట్టుబట్టింది. లోక్‌సభ స్థానాల్లో కూడా గతంలో పోటీ చేసిన 12 స్థానాల కంటే ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరింది. ఈ ప్రతిపాదనకు బీజేపీ తిరస్కరించింది. |