సార్వత్రిక ఎన్నికల అనంతరం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని సీపీఐ జతీయ కార్యదర్శి ఏబీ.బర్ధన్ మరోమారు స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల్లో దేశ ఓటర్లు ఆ రెండు పార్టీలు మినహా మిగిలిన పార్టీలకే పట్టం కడుతారని, అందువల్ల తాము ప్రభుత్వం ఏర్పాటుకు పూనుకుంటామన్నారు.
ఫలితాల అనంతరం మొదటి స్థానంలో తాము, ద్వితీయ స్థానంలో కాంగ్రెస్, తృతీయ స్థానంలో భాజపాలు ఉంటాయని జోస్యం చెప్పారు. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పక్షంలో తాము ప్రతిపక్షంలో కూర్చొంటామే గానీ, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వబోమన్నారు. వారినే ప్రభుత్వాన్ని నడపనివ్వండి. మేము ప్రతిపక్షంలో కూర్చొంటాం.
ఒకవేళ హంగ్ ఏర్పడితే ఆ రెండు పార్టీలను పక్కన పెట్టి ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఫలితాల అనంతరం భాజపా మాత్రం తప్పకుండా అధికారంలోకి రాదని, ఆ పార్టీకి మూడో స్థానం దక్కుతుందన్నారు. శరద్‌పవార్ పార్టీ, బిజూ జనతాదళ్ పార్టీలు వామపక్షాలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని బర్ధన్ జోస్యం చెప్పారు. |