భారతీయ జనతా పార్టీ మద్దతు ఉపసంహరణతో మైనారిటీలో పడిన ఒరిస్సాలోని అధికార బిజూ జనతాదళ్ ప్రభుత్వం ఈనెల 11వ తేదీన బలాన్ని నిరూపించుకోవాలని ఆ రాష్ట్ర గవర్నర్ ఎం.సి.భండారీ ఆదేశించారు. ఆ మరుక్షణమే గవర్నర్‌ను కలిసిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కలిసి తమకు 74 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని వెల్లడించారు. అయినప్పటికీ, గవర్నర్ ఆదేశం మేరుకు ఈనెల 11వ తేదీన బలపరీక్షకు సిద్ధమని ఆయన ప్రకటించారు. ఆయన ఆదివారం గవర్నర్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తమకు 74 మంది ఎమ్మెల్యేలకు పైగా మద్దతు ఉందని ప్రకటించారు. కాగా, గవర్నర్‌ను కలిసిన వారిలో ముఖ్యమంత్రితో సహా 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు బీజేడీ వర్గాలు వెల్లడించాయి. స్పీకర్ కిషోర్ మొహంతీ, మాజీ మంత్రి దెబాషిస్ నాయక్‌లు గైర్హాజరైనట్టు చెప్పారు. అయితే, వామపక్షాలకు చెందిన నలుగురు సభ్యులతో సహా, ఎన్.సి.పికి చెందిన ఒక సభ్యుడు, జేఎంఎంకు చెందిన నలుగురు సభ్యులు కూడా గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 147 సభ్యులు కలిగిన ఒరిస్సా అసెంబ్లీలో భాజపాకు 30 మంది, కాంగ్రెస్‌కు 38 మంది సభ్యుల బలం ఉన్న విషయం తెల్సిందే. కాగా, ఈ రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం త్వరలో ముగియనుండటంతో వచ్చే లోక్‌సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, మద్దతు ఉపసంహరణతో మైనారిటీలో పడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన విధించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. |