ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకోనున్నట్టు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ వెల్లడించారు. ఈ అశంపై ఆయన నవీన్‌తో చర్చలు జరుపుతామని ఆయన ఆదివారం స్వయంగా వెల్లడించారు. ఇదిలావుండగా, మాజీ ప్రధాని, జనతాదళ్ (ఎస్) అధ్యక్షుడు దేవెగౌడ మాత్రం, తృతీయ కూటమలో చేరాల్సిందిగా కోరుతూ నవీన్‌కు లేఖ రాశారు. దీంతో ఒరిస్సా రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటిరిగా బరిలోకి దిగుతుందని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఇదిలావుండగా, ఈనెల 11వ తేదీన బలపరీక్షకు సిద్ధమవుతున్న నవీన్ పట్నాయక్‌కు వామపక్షాలు, ఎన్.సి.పి వంటి పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో ఆయన గెలుపు సాధ్యమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం భాజపా మద్దతు ఉపసంహరణతో మైనారిటీలో పడిన బీజేడీ ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తోంది. సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో భాజపా, బీజేడీల మధ్య ఉన్న 11 సంవత్సరాల పొత్తు విచ్ఛిన్నమైన విషయం తెల్సిందే. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరుపనున్నట్టు ఏచూరీ వెల్లడించారు. |