వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో తృతీయ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ జోస్యం చెప్పారు. ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీతో బిజూ జనతాదళ్ తెగతెంపులు చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయమైన ఏకేజీ భవన్‌లో రెండు రోజులపాటు జరిగిన కేంద్ర కమిటీ సమావేశం అనంతరం ఆదివారం పశ్చిమబెంగాల్ సహా మొత్తం 15 రాష్ట్రాలు, అండమాన్ నికోబార్‌లలో పోటీ చేయనున్న 59 స్థానాలను, అక్కడ బరిలోకి దిగనున్న అభ్యర్థుల జాబితాను కారత్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై కేంద్ర కమిటీ సమావేశంలో చర్చ జరిగిందని, అందులో మరికొన్ని అంశాలను చేర్చాల్సి ఉన్నందున మేనిఫెస్టో విడుదలను వాయిదా వేసినట్లు తెలిపారు. కాగా, బీజేడీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకుంటామన్నారు. ఇందుకోసం సీతారాం ఏచూరిని భువనేశ్వర్ పంపామని, బీజేడీకి మద్దతుకు సంబంధించిన విషయాలు అన్నిటిపైనా చర్చిస్తారని తెలిపారు. ఎన్నికల ముందు ఎవరితోనూ పొత్తు పెట్టుకోకపోయినా మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ తమ కూటమిలోనే ఉన్నారని, అలాగే తమిళనాడులో అన్నాడీఎంకేతో కలిసే వామపక్షాలు పోటీ చేస్తాయని తెలిపారు. అందువల్ల వచ్చే ఎన్నికల ఫలితాల అనంతరం తృతీయ కూటమి ప్రభుత్వ ఏర్పాటును కొట్టిపారేయలేమన్నారు. |