ముంబయి దాడుల సందర్భంగా ప్రాణాలతో చిక్కిన అజ్మల్ అమిర్ కసబ్‌ను కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించనుంది. కసబ్‌ను కోర్టుకు తరలించాలంటే సెక్యూరిటీ పరమైన సమస్యలు అధికంగా ఉన్న నేపథ్యంలో పోలీసులు ఈ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మధ్య ముంబయిలోని ఆర్తూర్ రోడ్‌లోని జైలులో హై సెక్యురిటీ బారక్‌లో ఉంచిన కసబ్‌ను అక్కడినుంచే కోర్టు విచారించనుంది.
ఈ నేపథ్యంలో సోమవారం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కసబ్ విచారణలో పాల్గొననున్నాడు. ముంబయిపై జరిగిన తీవ్రవాదుల దాడి సందర్భంగా గత ఏడాది నవంబర్ 26న కసబ్ అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ అరెస్టు జరిగిన తర్వాత ఇప్పటివరకు అతనిని పోలీసులు కోర్టుకు తరలించలేదు. సెక్యురిటీ పరమైన చిక్కులు ఉన్న కారణంగానే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అదేసమయంలో ఇటీవలే ముంబయి పోలీసులు కసబ్‌తో సహా మరో ఇద్దరిపై ఛార్జ్‌షీటు తయారు చేసిన సంగతి తెలిసిందే. ముంబయిపై జరిగిన తీవ్రవాదుల దాడులకు, అందులో 160మంది మృతి చెందడానికి ప్రధాన కారణంగా పేర్కొంటూ వీరిపై పోలీసులు ఛార్జ్‌షీటు దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో ప్రాసిక్యూషన్ తరపు లాయర్ కసబ్‌ను విచారించనున్నారు. అలాగే ఛార్జ్‌షీట్ నకలు కావాలంటూ పిటిషన్ వేసిన అన్సారీ, అహ్మద్‌లకు ఉర్ధూలో ఛార్జ్‌షీట్ నకలు పంపాలని కూడా కోర్టు ఆదేశాలు జారీచేయనుంది. |