ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు ఖరారు చేసుకునేందుకు చివరి క్షణం వరకు వేచిచూస్తామని కాంగ్రెస్ తెలిపింది. ముందురోజు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు కొనసాగించే అవకాశాన్ని ఉత్తరప్రదేశ్‌లో ఆరు లోక్‌సభ సీట్లు మాత్రమే ఇస్తామనే ప్రతిపాదనతో ఎస్పీ పూర్తిగా నీరుగార్చిన సంగతి తెలిసిందే.
రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఆరు సీట్లు మాత్రమే సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌కు ఇస్తామని ఎస్పీ ప్రతిపాదన చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ 24 స్థానాల కోసం పట్టుబడుతోంది. ఇరుపక్షాలు సీట్ల సర్దుబాటుపై పట్టువీడకపోవడంతో, వీటి మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.
తాజాగా సమాజ్‌వాదీతో పొత్తుపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ఆ పార్టీతో పొత్తు ఖరారు చేసుకునేందుకు చివరి క్షణం వరకు వేచిచూస్తామని చెప్పారు. ఇరుపక్షాల మధ్య ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు చివరివరకు ప్రయత్నిస్తామని తెలిపారు. చివరి క్షణం వరకు ఇరుపార్టీల మధ్య పొత్తుకు ద్వారాలు తెరిచే ఉంటాయన్నారు.
అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని అన్ని లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు తాము సన్నద్ధమై ఉన్నామని వ్యాఖ్యానించారు. వారు తమకు 6 సీట్లు ఇస్తామని నిర్ణయించినట్లే, వారికి తామెన్ని స్థానాలు విడిచిపెట్టగలమో ఇంకా నిర్ణయించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, యూపీ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. |