ప్రధాని మన్మోహన్ సింగ్ వచ్చే నెల 2వ తేదీన అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాతో సమావేశం కానున్నారు. ఇంగ్లండు ప్రధాని ఆహ్వానం మేరకు జి-20 సదస్సుకు హాజరు కానున్న ప్రధాని అక్కడ ఒబామాతో పలు అంశాలపై చర్చలు జరుపుతారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ప్రధాని ఏప్రిల్ ఒకటో తేదీన న్యూఢిల్లీ నుంచి బయలుదేరి వెళతారనీ, ఏప్రిల్ 4న తిరిగి భారత్ చేరుకుంటారని కార్యాలయ వర్గాలు తెలిపాయి. జి-20 సదస్సుకు సంబంధించి భారత్ లేవనెత్తబోయే అంశాల గురించి ఇప్పటికే మన దేశ విదేశాంగ సహాయమంత్రి శివశంకర్ అమెరికాకు వివరించడానికి వాషింగ్టన్ బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా దేశం ఎదుర్కొంటున్న తీవ్రవాద సమస్య, అణు విధానంపై భారత్ తన వాణిని వినిపించనుంది.
కాగా ఇటీవల ఒబామా వీసా నిబంధనల కఠినతరం చేయడం, ఔట్ సోర్సింగ్ నియంత్రణ వంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో వాటని సరళతరం చేయాలని ప్రధాని ఒబామాను అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జి-20 సదస్సులో తాను పాల్గొనే ఒకరోజు సమావేశంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిపై చర్చించాలని ప్రధాని యోచన చేస్తున్నట్లు సమాచారం. |