మరోసారి ర్యాగింగ్ వికృతరూపం దాల్చడంతో ప్రథమ సంవత్సరం చదువుతున్న మెడికో మృతి చెందాడు. ర్యాగింగ్ పేరుతో తాగిన మత్తులో సీనియర్లు విపరీతంగా కొట్టడంతో సదరు మెడికో మృతి చెందాడు. మృతి చెందడానికి ముందు సదరు మెడికో ర్యాగింగ్ గురించి కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం గమనార్హం.
హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ వైద్య కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. అమన్ కాక్రూ అనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన 19ఏళ్ల విద్యార్ధి గత ఏడాది ఈ కళాశాలలో మెడికల్ కోర్సులో చేరాడు. ఈ నేపథ్యంలో హాస్టల్‌లో ఉంటున్న ఆమన్‌ను సీనియర్ విద్యార్ధులు తరచూ వేధించేవారు. ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి సీనియర్ విద్యార్థులు తాగిన మత్తులో ఆమన్‌ను విపరీతంగా కొట్టారు.
దీంతో శనివారం ఆమన్ తనపై ర్యాగింగ్ పేరుతో జరిగిన అమానుష దాడి గురించి కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. అయితే కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించలేదు. దీని తర్వాత అమన్ మృతి చెందడం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ వార్డెన్‌తో సహా మేనేజర్‌ను సస్పెండ్ చేసింది. అలాగే ఆమన్ మృతికి కారణమైన సీనియర్ విద్యర్ధులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించింది.
అదేసమయంలో రంగంలో దిగిన పోలీసులు ఈ ఘటనతో సంబంధమున్న నలుగురు సీనియర్ విద్యార్ధులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. |