తాము ఇంకా తృతీయ కూటమిలో చేరలేదని, దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) మంగళవారం స్పష్టం చేసింది. దీంతో బీజేడీ ఏ రాజకీయ కూటమిలో చేరుతుందనేది ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలింది.
ఇదిలా ఉంటే జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ మంగళవారం మాట్లాడుతూ.. బీజేడీ తృతీయ కూటమిలో చేరేందుకు అంగీకరించిందని తెలిపారు. తృతీయ కూటమిలోకి బీజేడీని తీసుకొచ్చేందుకు దేవెగౌడ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. గత వారాంతంలో బీజేపీతో 11 ఏళ్ల మైత్రీబంధాన్ని బీజేడీ తెంచుకుంది.
దీంతో ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకురాగా, బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్ష ఎన్డీఏ కూటమికి బీజేడీ గుడ్‌బై చెప్పింది. ఈ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలు తమ తృతీయ కూటమిలోకి బీజేడీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
తాజాగా తృతీయ కూటమిలో బీజేడీ చేరేందుకు అంగీకరించిందని దేవెగౌడ చెప్పారు. తాను బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌తో మాట్లాడానని, ఆయన బేషరతుగా తృతీయ కూటమిలో చేరేందుకు అంగీకరించారని తెలిపారు.
అనంతరం బీజేడీ దేవెగౌడ చేసిన ఈ ప్రకటనను తోసిపుచ్చింది. గౌడ ప్రకటనను టీవీలో చూశామనీ, ప్రస్తుతానికి తాము అటువంటి నిర్ణయాలేమీ తీసుకోలేదని, ఏదో ఒక రాజకీయ కూటమిలో చేరే అంశం ఇప్పుడు తమ పరిశీలనలో లేదని బీజేడీ ప్రధాన కార్యదర్శి దామోదర్ రౌత్ పేర్కొన్నారు. |