బీజేపీ అభ్యర్థిగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న వరుణ్ గాంధీ తాజాగా పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయనకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. బీజేపీ నాయకత్వం కూడా వరుణ్ వ్యాఖ్యలపట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇటీవల తాను పోటీ చేస్తున్న పిలిభిత్‌లో జరిగిన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో వరుణ్ గాంధీ మాట్లాడుతూ.. మైనారిటీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఇది చేయి కాదు(కాంగ్రెస్ పార్టీ గుర్తు), ఇది కమలం (బీజేపీ గుర్తు) శక్తి అన్నారు. ఇది .......తలకాయలు కోస్తుంది.. జైశ్రీరామ్ అంటూ వరుణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈసీ నోటీసులు జారీ చేసింది.
ఇందిరాగాంధీ మనవడు మరో ఎన్నికల సమావేశంలో మాట్లాడుతూ.. ఎవరైనా హిందువులపై వేలెత్తి చూపితే లేదా ఎవరైనా హిందువులు బలహీనులు, నాయకత్వం లేనివారని భావిస్తే, ఓట్ల కోసం ఈ నేతలు మన చెప్పులు నాకుతారని అనుకుంటే.. హిందువులపైకి ఎవరైనా వేలెత్తి చూపితే.. అప్పుడు తాను గీతను చేతబట్టి, చేయి నరుకుతానని వరుణ్ గాంధీ వ్యాఖ్యానించారు.
వరుణ్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ వెంటనే ఖండించింది. ఈ వ్యాఖ్యలు అనైతికమని, చట్టవ్యతిరేకమని దుయ్యబట్టింది. ఈ వ్యాఖ్యలు ఖండించదగినవి. మైనారిటీ వ్యతిరేక భావాలు, సంస్కృతి కలిగిన పార్టీలో వరుణ్ గాంధీ ఉన్నారని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఢిల్లీలో విలేకరులతో చెప్పారు. ఇదిలా ఉంటే బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా వరుణ్‌పై నిప్పులు చెరిగారు. |