టాటా కంపెనీకి చెందిన నానో ప్రాజెక్టు పశ్చిమ బెంగాల్ నుంచి వేరే ప్రాంతానికి తరలి వెళ్ళడం తమకెంతో బాధగావుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. దీనికి ప్రధాన కారణం తృణమూల్ కాంగ్రెస్ పార్టీయేనని ఆయన ఆ పార్టీని విమర్శించారు. కార్మికుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. నానో మోటార్స్ సంస్థ ఉత్పాదన సింగూర్ నుంచి తరలివెళ్ళడం వెనుక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హస్తంవుందని, లేకుంటే సోమవారం ఆ బుల్లికారు తమ రాష్ట్ర రాజధాని కోల్‌కతా లేదా ముంబైలో విడుదలైవుండేదని ఆయన తెలిపారు. దీంతోబాటు స్థానికులకు ఉద్యోగావకాశాలు కలిగివుండేవని ఆయన పేర్కొన్నారు. నానో తరలి వెళ్ళడంతో ప్రస్తుతం ఈ ప్రాంతంలోని దాదాపు ఆరువేలమందికి పైగా ఉపాధిని కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేసిన చేతకాని పనివలన ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసాన్ని కోల్పోయారనికూడా ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. |