మహాత్మా గాంధీతోబాటు తమ కుటుంబ సభ్యులు ఏ సంప్రదాయాల కోసం జీవించి, ప్రాణాలు త్యాగం చేశారో వాటికి విరుద్ధంగా వరుణ్ గాంధీ మత వైషమ్యాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడని అతడి సోదరి ప్రియాంక వధేరా తెలిపారు. శ్రీమద్భగవద్గీత చదివితే మనస్సు చంచలం కాకుండా ఉంటుందని ఆమె వరుణ్ గాంధీకి హితబోధ చేశారు. దీంతో వారిరువురి కుటంబాల మధ్య ఏర్పడిన అంతరాలు...ప్రియాంక మాటల ద్వారా బయటపడినట్లయ్యింది.ఫిల్భిత్ నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొడుతూ చేసిన ప్రసంగాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. వరుణ్ చేసిన వ్యాఖ్యలు గాంధీ కుటుంబపు సంప్రదాయాలు, సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకమైనవిగా ఆమె అభివర్ణించారు. సంప్రదాయాలు, సిద్ధాంతాలకోసం తమ కుటుంబం చాలా త్యాగాలు చేసిందని, టీవీలో అతని ప్రసంగం వింటూ చాలా బాధ పడ్డానని ఆమె తెలిపారు. రాయబరేలితో పాటు సోదరుడు రాహుల్ నియోజకవర్గం అమేథిలో కూడా రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రియాంక వచ్చారు. భగవద్గీతను బుద్ధిగా చదివి అర్ధం చేసుకోమని వరుణ్‌కు తాను సలహా ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతానికైతే రాజకీయాల్లో చేరే ఆలోచన తనకు లేదని, తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీల తరఫున తాను ప్రచారం చేయడానికి మాత్రమే వచ్చానని ఆమె వివరించారు. ఇదిలావుండగా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మాత్రం ఉత్తరప్రదేశ్‌ను కేంద్రం నిర్లక్ష్యం చేసిందన్న బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వం విమర్శనలను ప్రియాంక ఈ సందర్భంగా ఖండించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందని ఆమె తెలిపారు. |