కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ.. ప్రతిపక్ష బీజేపీ ప్రధాని అభ్యర్థి ఎల్‌కే అద్వానీపై నిప్పులు చెరిగారు. ఆయన దేశానికి ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో కీలక పాత్ర పోషించారని, గుజరాత్ అల్లర్లకు నేతృత్వం వహించారని, ఎన్డీఏ హయాంలో హోంమంత్రిగా పార్లమెంట్, ఎర్రకోటపై జరిగిన ఉగ్రవాద దాడులను అడ్డుకోలేకపోయారని విమర్శించారు
మన్మోహన్ సింగ్‌ను బలహీనమైన ప్రధానిగా గత ఐదేళ్లకాలంలో అద్వానీ పదేపదే విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలను కూడా మన్మోహన్ సింగ్ తిప్పికొట్టారు. హోంమంత్రిగా దేశ సంక్షేమానికి ఆయనేం చేశారని ప్రశ్నించారు.
అద్వానీ దేశాన్ని పాలించాలా వద్దా అనేది ఓటర్లే నిర్ణయిస్తారన్నారు. అద్వానీని అవకాశవాదిగా పేర్కొన్నారు. ఇందుకు పాకిస్థాన్ జాతిపిత ఎంఏ జిన్నాను అద్వానీ ప్రశంసించిన వివాదమే నిదర్శనమన్నారు. నేను బలహీనమైన ప్రధానినో లేదా బలమైన ప్రధానినో తమ ప్రభుత్వం సాధించిన ప్రగతి చూపిస్తుందని మన్మోహన్ సింగ్ విలేకరులతో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో తాను లేనని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి మన్మోహన్ సింగ్ అని స్పష్టం చేశారు. 2004లో తాను తీసుకున్న నిర్ణయంలో ఇప్పడు కూడా మార్పులేమీ ఉండవని సోనియా మంగళవారం పేర్కొన్నారు. ప్రధాని పదవిపై 2004లోనే స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాను.
ఇప్పుడు కూడా ఆ నిర్ణయంలో మార్పు ఏమీ లేదని చెప్పారు. 2004లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికయిన సోనియా గాంధీ, ప్రధాన బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. అనంతరం మన్మోహన్ సింగ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ముఖచిత్రంతో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ పైవిషయాలు వెల్లడించారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధానమంత్రి మన్మోహన్ సింగే తమ ప్రధాని అభ్యర్థి అని ప్రకటించారు. ఇతర రాజకీయ పక్షాల ప్రధాని అభ్యర్థులు మన్మోహన్ సింగ్‌కు సాటిరారని పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం గత ఐదేళ్లలో సాధించిన ప్రగతిపై సోనియా సంతృప్తి వ్యక్తం చేశారు. |