ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా తనను లక్ష్యంగా చేసుకొని చేసిన విమర్శలను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్‌కే అద్వానీ తిప్పికొట్టారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో కీలకపాత్ర పోషించారని, గుజరాత్ అల్లర్లకు నేతృత్వం వహించారని, తీవ్రవాదాన్ని అరికట్టడంలో హోంమంత్రిగా విఫలం అయ్యారని అద్వానీపై మన్మోహన్ సింగ్ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.
ఈ విమర్శలను కొన్ని గంటల తరువాత ఎల్‌కే అద్వానీ కూడా తిప్పికొట్టారు. మధురలో జరిగిన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో ప్రధాని విమర్శలపై అద్వానీ మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని సోనియా గాంధీనే నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తానింతవరకు మన్మోహన్ సింగ్ అంత బలహీన ప్రధానమంత్రిని చూడలేదని వ్యాఖ్యానించారు.
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని నిజానికి సోనియాగాంధీనే నడిపిస్తున్నారని, ఆమె ఆమోదించాకే అన్ని నిర్ణయాలు వెలువడతాయని చెప్పారు. కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాన్ని మన్మోహన్ ప్రభుత్వమనే దానికన్నా, సోనియా గాంధీ ప్రభుత్వం అనడం మేలని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యమైన చిరునామా ప్రధాని నివాసం కాగా, ఇప్పుడు సోనియా గాంధీ ఉంటున్న టెన్ జన్‌పథ్ కీలకంగా మారిందని వ్యాఖ్యానించారు. |