సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)లు బీహార్‌లో వచ్చే ఎన్నికలను కలిసి ఎదుర్కోవాలని నిర్ణయించాయి. మూడు పార్టీలు వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓ అవగాహనకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ ప్రకటించారు.
ఆర్జేడీ అధినేత, కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ చేతులు కలిపే అవకాశం ఉందని, ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ కూడా తమతో చేరాలని కోరుకుంటున్నట్లు అమర్ సింగ్ బుధవారం పేర్కొన్నారు. ఈ పొత్తు ఖరారైతే బీహార్‌లో లౌకికవాద శక్తులన్నీ ఏకతాటిపైకి వచ్చినట్లు అవుతుందన్నారు.
ఇదిలా ఉంటే తాజా పరిణామాన్ని ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ ధృవీకరించారు. ఎల్జేపీ, ఎస్పీ, ఆర్జేడీ పొత్తు వార్తలు వాస్తవమేనన్నారు. తాను ములాయం సింగ్ యాదవ్, అమర్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్‌లతో దీనికి సంబంధించి చర్చలు జరిపినట్లు రాంవిలాస్ వెల్లడించారు. మతతత్వ శక్తులను ఎదుర్కొనేందుకు తాము ఏకతాటిపైకి వచ్చామన్నారు. |