ముంబయిపై జరిగిన తీవ్రవాదుల దాడుల్లో ప్రాణాలతో పట్టుబడిన అజ్మల్ అమిర్ కసబ్ కోసం ప్రత్యేక కోర్టు న్యాయవాదిని నియమించింది. కసబ్ కేసు ఏప్రిల్ ఆరున విచారణకు రానున్న నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు నిర్ణయం ప్రకారం అంజలీ వాగ్మరే అనే ఈ లాయర్ కసబ్ తరపున విచారణకు హాజరుకానున్నారు.
ఈ విషయమై న్యాయమూర్తి ఎమ్ఎల్ తహిల్యానీ మాట్లాడుతూ కసబ్ కోసం నియమించిన న్యాయవాది వాగ్మరేకు సహాయం కోసం మరో న్యాయవాదిని కూడా నియమించనున్నట్టు తెలిపారు. ముంబయిలోని ఆర్థూర్ రోడ్ జైలులో ఉన్న కసబ్‌పై విచారణ ఏప్రిల్ ఆరునుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తనకు లాయర్‌ను నియమించిన విషయాన్ని కోర్టు కసబ్‌కు తెలియజేసింది. దీంతోపాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు నియమించిన న్యాయవాదిని కసబ్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా కసబ్ మాట్లాడుతూ లాయర్‌ను నియమించడంపై అభ్యంతరమేమీ లేదని పేర్కొన్నాడని అధికారులు తెలిపారు. అలాగే తనకు వార్తా పత్రికలు కావాలంటూ కసబ్ కోర్టును అడిగినట్టు అధికారులు పేర్కొన్నారు. |