అస్సాం రాష్ట్రంలోని గౌహతికి సమీపంలోని మాలిగాన్ ప్రాంతంలో సోమవారం సంభవించిన బాంబు పేలుడు కారణంగా కనీసం నలుగురు మృతి చెందగా మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రంలోని దిబ్రూగర్‌లో మంగళవారం ఓ ఎన్నికల ప్రచారసభలో పాల్గొననున్న తరుణంలో ఈ పేలుడు సంభవించడం గమనార్హం.
జలక్‌పరి పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఓ మోటారు సైకిల్‌లో ఉంచిన బాంబు పేలిన కారణంగా ఈ పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు కారణంగా ఆ ప్రదేశంలోని చాలా కార్లు భారీగా ధ్వంసమయ్యాయి.
ఈ విషయమై అస్సాం ఆరోగ్యశాఖ మంత్రి హెమంత బి శర్మ మాట్లాడుతూ ఈ పేలుడు చోటు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు భద్రత కోసం మరిన్ని దళాలను పంపాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అదేసమయంలో ఇలాంటి ఘటనల వల్ల శాంతియుతంగా ఎన్నికలు జరపాలన్న తమ నిర్ణయానికి విఘాతం ఏర్పడబోదని ఆయన స్పష్టం చేశారు. |