సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తమ కార్యకర్తలచే నిధుల సేకరణ జరిపించినట్లు వచ్చిన తీవ్ర ఆరోపణలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి పుట్టినరోజు వేడుకల సందర్భంగా పార్టీ కార్యకర్తలు నిధుల సేకరణ జరిపారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
దీనిపై దర్యాప్తు జరపాలని ములాయం సింగ్ యాదవ్ సోమవారం డిమాండ్ చేశారు. గత ఏడాది జరిగిన పుట్టినరోజు వేడుకలకు రాష్ట్రంలో రూ.12 కోట్ల నిధులు సేకరించారని, ఈ ఏడాది దీనికి రెట్టింపు నిధులు సేకరించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని యాదవ్ విలేకరులతో చెప్పారు. ఈ కేసుపై దర్యాప్తు జరిపినప్పటికీ, మమ్మల్ని జైలులో పెట్టించాలనుకున్నవారు బయటే ఉన్నారని మాయావతిని ఉద్దేశించి ములాయం పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
మాయవతి పుట్టినరోజుకు నిధులు ఇచ్చేందుకు నిరాకరించిన రాష్ట్ర ప్రజా పనుల శాఖ ఇంజనీరు ఇటీవల అనుమానిత బీఎస్పీ కార్యకర్తలచే హత్య చేయబడిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే స్విస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న కొందరు రాజకీయ నాయకులపై ములాయం సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి ఖాతాల్లోకి కోట్లాది రూపాయల డబ్బు ఎలా వచ్చిందనే దానిపై కూడా ప్రభుత్వం దర్యాప్తు జరపాలన్నారు. గరిష్టంగా రూ.5 లక్షల వరకు ప్రజల వద్ద నుంచి మాయావతి పుట్టినరోజుకు బీఎస్పీ కార్యకర్తలు నిధులు సేకరించారనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. త్వరలోనే ఈ ఆధారాలను బహిర్గతం చేస్తామని ములాయం సింగ్ వెల్లడించారు. |