యూపీఏ కూటమిలోని మిత్రపక్షాల మధ్య తలెత్తిన మనస్పర్థలు అంతిమంగా తమకు లాభిస్తుందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత, ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి ఎల్‌కే అద్వానీ పేర్కొన్నారు. ఎన్నికలకు నెలరోజులముందుగానే యూపీఏ ముక్కలు కావడం భాజపాకు లాభించనుందని ఆయన వ్యాఖ్యానించారు.
జనతాదళ్ (యు) నేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌తో కలిసి బీహార్‌లో అద్వానీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బక్సార్, ససారం, నెవడాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ ప్రాభవానికి బీజేపీ గండికొట్టిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే కేంద్రంలో పెద్ద పార్టీలని వీటి భాగస్వామ్యం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు వీలుకాదని ఆయన తెలిపారు. అదేసమయంలో రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని, సుపరిపాలన, అభివృద్ధి, జాతీయ భద్రతలే అజెండాగా ఈ ఎన్నికలను తాము ఎదుర్కోనున్నామని ఆయన పేర్కొన్నారు.
గతంలో అణు వివాదం సమయంలో వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకోగానే రాజీనామా చేయాల్సిన యూపీఏ విశ్వాస పరీక్ష సందర్భంగా ఎంపీలను కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిందని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే అక్రమార్కులు విదేశీ బ్యాంకుల్లో దాచిన నల్ల ధనాన్ని వెలుపలికి తెస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. |