ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12మంది మృతి చెందగా, 10మంది గాయపడ్డారు. మృతి చెందినవారివారిలో తొమ్మిదిమంది సీఆర్‌పీఎఫ్ జవానులు, ముగ్గురు మావోయిస్టులు ఉన్నారు. దంతెవాడ జిల్లా చింతాగుపా అటవీప్రాతంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసు డిప్యూటీ కమాండెంట్ దివాకర్ తివారీ నేతృత్వంలో సీఆర్‌పీఎఫ్ 55వ బెటాలియన్‌కు చెందిన 20మంది పోలీసులు దంతెవాడ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల పరిస్థితిని పరిశీలించేందుకు బయలుదేరారు. వీరంతా చింతాగుపా కొండ ప్రాంతానికి చేరుకోగానే అక్కడ మాటు వేసిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు ప్రయత్నించారు.
దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. సుమారు రెండు గంటలపాటు జరిగిన హోరాహోరీ కాల్పుల్లో మొత్తం 12మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. మృతి చెందినవారిలో పోలీసు డిప్యూటీ కమాండెంట్ దివాకర్ తివారీ కూడా ఉన్నారు. |