తాము అధికారంలోకి వస్తే పాకిస్థాన్‌తో సత్ సంబంధాలు నెలకొల్పుతామని సమాజ్‌వాదీ పార్టీ హామీ ఇచ్చింది. తొలి దశ ఎన్నికల పోలింగ్‌కు సమయం మరో నాలుగు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను శనివారం విడుదల చేసింది. తమ పార్టీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో సత్‌సంబంధాలు నెలకొల్పుతామని చెప్పారు.
అంతేకాకుండా, పొరుగు దేశాలతో సుహృద్భావ వాతావరణంలో రాజకీయాలు సాగించడం, సరిహద్దుల్లో బలగాల సంఖ్యను పెంచడం వంటివి చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తీవ్రవాదానికి ప్రాంతీయ అసమానతలే ప్రధాన కారణమని చెప్పుకొచ్చిన ఆయన, అమెరికా సాయంతో తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తామని ప్రకటించారు.
తమ మద్దతుతో కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంతో ప్రాంతీయ మతవాద శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పార్టీ నేతలైన అమర్ సింగ్, సంజయ్‌దత్‌లు పాల్గొన్న ఈ సమావేశంలో నిరుద్యోగం, విద్య, అవినీతి, పర్యావరణ పరిరక్షణ, బీసీలకు రిజర్వేషన్లు, మైనారిటీ, గిరిజన తెగల ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని ములాయం చెప్పారు. |