ప్రస్తుతం దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల శకం నడుస్తోందని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బాగా బలహీన పడటం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ 220 సీట్లలో బాగా వెనుకబడి వుందన్నారు. వీటిలో ఉత్తరప్రదేశ్ (85 సీట్లు), బీహార్ (54), పశ్చిమ బెంగాల్ (42), తమిళనాడు (39)లలో తమ పార్టీ బాగా బలహీనంగా ఉందన్నారు.
ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోందని, అందువల్ల తాము బలహీన పడినట్టు చెప్పారు. ప్రస్తుతం ఇది సంకీర్ణ ప్రభుత్వాల శకమన్నారు. 1996 వరకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే 45 సంవత్సరాల పాటు దేశాన్ని పాలిచిందని గుర్తు చేశారు. సంకీర్ణ ప్రభుత్వాలను ప్రజలు కోరుకోవడం లేదు. అయితే, సంకీర్ణ ప్రభుత్వాలు అనేవి రాజకీయాల్లో చోటు చేసుకున్న అనివార్య మార్పుల వల్ల ఏర్పడుతున్నాయన్నారు. ప్రధానంగా 220 సీట్ల ఫలితాలలో కనిపిస్తున్న మార్పువల్లే ఈ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
కేంద్ర కేబినెట్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్ తర్వాత రెండో వ్యక్తిగా చెలామణి అవుతున్న ప్రణబ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎపుడైతే అతిపెద్ద పార్టీ స్థానాన్ని కోల్పోయిందో, ఆ తర్వాత సాధారణ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ కూడా సింగిల్ మెజార్టీ సాధించలేక పోతోందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ అంశాలకంటే ప్రాంతీయ, స్థానిక అంశాలు ప్రభావం చూపబోవన్నారు. అయితే, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో మాత్రం వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. |