దేశంలోని మతతత్వ శక్తుల విషయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దేశభక్తి ముసుగులో ఈ రకమైన శక్తులు దేశ సమైఖ్యతను విచ్ఛిన్న పరుస్తున్నాయని ఆమె ఆరోపించారు. అందుకే సమైఖ్యత, శాంతికి ముప్పుగా మారిన ఈ శక్తుల పట్ల నిరంతర జాగరూకతతో నడుచుకోవాలని ఆమె కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జార్ఖండ్‌లోని కుంతి, బీహార్‌లోని జామూయ్, ఛాత్రాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో సోనియా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో నేడు ఫ్రంట్‌లను ఏర్పాటు చేయడం ఫ్యాషన్‌గా మారిపోయిందని విమర్శించిన ఆమె వీటివల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం మూడో కూటమి, నాలుగో కూటమి అంటూ తెరమీదకు వచ్చాయని ముందు ముందు ఇలాంటివి చాలా వచ్చే అవకాశం ఉందంటూ ఆమె ఎద్దేవా చేశారు.
దేశంలోని మతతత్వం, దారిద్య్రం, తీవ్రవాదంపై పోరాడే శక్తి ఈ కూటములకు లేదంటూ ఆమె విమర్శించారు. అసలు ఈ కూటములకు ప్రభుత్వాలను నడిపేంతటి సామర్థ్యం లేదంటూ ఆమె కొట్టిపారేశారు. నాలుగో కూటమి నేతలు కాంగ్రెస్‌తోనే జట్టు కడతారని అయితే ఆ పార్టీనే విమర్శిస్తారంటూ ఆమె మండిపడ్డారు.
దేశంలోని వివిధ మతాలకు, కులాలకు చెందిన ప్రజలు శాంతి, మత సామరస్యంతోనే జీవిస్తున్నారని, కానీ మతతత్వ శక్తులు ఈ వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ ఆమె పేర్కొన్నారు. ఈ రకమైన శక్తులు తీవ్రవాదులతో సమానమంటూ ఆమె తెలిపారు. |