తృతీయ కూటమి అధికారంలోకి వస్తే అమెరికాతో కుదుర్చుకున్న వివాదాస్పద పౌర అణు సహాకార ఒప్పందంపై పునరాలోచిస్తామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ తెలిపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం వివాదాస్పద రీతిలో అమెరికా ప్రభుత్వంతో ఈ ఒప్పందంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై గతంలో దేశంలో పెద్దఎత్తున రాజకీయ దుమారం చెలరేగిన విషయం విదితమే. ఈ అణు ఒప్పందం కారణంగా తలెత్తిన విభేదాలతోనే వామపక్షాలు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాయి. తాజాగా ఈ వివాదాస్పద ఒప్పందాన్ని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి తెరపైకి తీసుకువచ్చారు
తృతీయ కూటమి అధికారంలోకి వస్తే, అణు ఒప్పందంపై పునరాలోచన జరుపుతామని సీతారాం ఏచూరి ప్రకటించారు. ఈ ఒప్పందం భారత్‌పై ఒత్తిడి పెంచుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్‌యేతర లౌకికవాద సుస్థిర ప్రభుత్వాన్ని తృతీయ కూటమి అందించగలదని తెలిపారు. ప్రస్తుతం దేశంలో తృతీయ కూటమికి మంచి స్పందన వస్తోందని చెప్పారు. 1996, 1998నాటి పరిస్థితులు పునరావృతం కాగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. |