ఉపాధ్యాయుడి కిరాతక దండనకు ఓ 11 సంవత్సరాల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఉపాధ్యాయుడు చావగొట్టడంతో కోమాలోకి వెళ్లిన బాలిక శుక్రవారం తుదిశ్వాస విడిచింది. దేశ రాజధానిలో ఈ దుశ్చర్య వెలుగుచూసింది. ఓ పాఠశాల ఉపాధ్యాయుడి చేతిలో గురువారం చావుదెబ్బలు తిని కోమాలోకి వెళ్లిన ఆ బాలిక ప్రాణాలతో పోరాడి ఓడిపోయింది.
ఉత్తర ఢిల్లీలోని నరెలా ప్రాంతంలో ఉన్న ఎన్‌డీ ప్రైమరీ పాఠశాలలలో రెండో తరగతి చదువుతున్న షానూ ఖాన్ అనే విద్యార్థినిని ఆ పాఠశాల ఉపాధ్యాయుడి కిరాతక దండన కారణంగా కోమాలోకి వెళ్లింది. ఇదిలా ఉంటే ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు ఈ దుర్ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాయి.
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుకా చౌదరి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ దుశ్యర్యపై ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ విచారణకు ఆదేశించింది. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. ఆంగ్ల అక్షరమాలను గుర్తుపెట్టుకొని తిరిగి చెప్పనందుకు షానూపై ఉపాధ్యాయుడు చేయి చేసుకున్నాడు.
షానూ తలను బెంచికి కొట్టడంతోపాటు, అనంతరం ఆమెను రెండు గంటలపాటు ఎండలో నిలబెట్టాడు. ఎండ తీవ్రత తట్టుకోలేక షానూ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. షానూను ఆ పరిస్థితిలో చూసి, అదే పాఠశాలలో చదువుతున్న ఆమె సోదరి తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అనంతరం ఆమెను తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే షానూ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆమెను కాపాడటం కష్టమని వైద్యులు చెప్పారు. కోమాలో ఉన్న షానూ శుక్రవారం కన్నుమూసింది. |