ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శనివారం బాబ్రీ మసీదు వివాదాన్ని కాంగ్రెస్ మెడకు చుట్టారు. 1992నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో భారతీయ జనతా పార్టీకి ఎంత పాత్ర ఉందో, కాంగ్రెస్‌కు కూడా అంతే పాత్ర ఉందని లాలూ ప్రసాద్ యాదవ్ కాంగీయులపై నిప్పులు చెరిగారు.
బాబ్రీ మసీదు కూల్చివేతకు బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యురాలేనని లాలూ ఆరోపించారు. బాబ్రీ మసీదు కూల్చివేత వివాదాన్ని తెరపైకి తెచ్చిన లాలూ ప్రసాద్ దీనికి సంబంధించి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్‌కే అద్వానీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనంతరం పనిలోపనిగా 16వ శతాబ్దానికి చెందిన మసీదును కూల్చివేయడంలో కాంగ్రెస్ కూడా కారణమని పేర్కొన్నారు.
మసీదు కూల్చివేతకు అద్వానీ ప్రధాన కారకుడని, దీనిని కూల్చివేయకుండా అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందన్నారు. ఈ వైఫల్యం నుంచి కాంగ్రెస్ తప్పించుకోజాలదని లాలూ శనివారం విలేకరుల వద్ద పేర్కొన్నారు. కాంగ్రెస్ కావాలనుకుంటే, బాబ్రీ కూల్చివేతను అడ్డుకొని ఉండేదన్నారు. |