గతంలో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం వివాదంలో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం బాధ్యత లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో అప్పట్లో బీజేపీ అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ బాబ్రీ మసీదు రక్షణకు భరోసా ఇచ్చారని దాన్ని నమ్మడంవల్లే కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బాబ్రీ విధ్వంసాన్ని ఊహించలేకపోయిందని ప్రధాని వ్యాఖ్యానించారు.
అసోంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌహతిలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ అప్పట్లో బాబ్రీని కాపాడుతామని కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చిందని తెలిపారు. దీనివల్ల బాబ్రీకి వచ్చిన నష్టమేమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం భావించిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రవాదం, నక్సలిజం భారత్కు పెనుముప్పుగా పరిణమించాయని అన్నారు. వీటిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇదిలావుండగా అద్వానీ విమర్శలపై ఆయన స్పందిస్తూ అనవసర వివాదాలకు తాను స్పందించదలచుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఓటు వేయడం ద్వారా దేశంలో సెక్యులరిజాన్ని కాపాడాలంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. |