ప్రధానమంత్రి పదవిని చేపట్టే అభ్యర్థి లోక్‌సభ నుంచి ప్రాతినిథ్యం వహించే నేతగా ఉండాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ప్రధాని మన్మోహన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెల్సిందే. దీనిపై కారత్ మాట్లాడుతూ ఇప్పటి వరకు రాజ్యసభ సభ్యుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టడాన్ని చూశాం. ఇకపై లోక్‌సభ సభ్యుడే ఈ పదవిని చేపట్టేలా చూస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశంపై భాజపా కూడా ఇదే విధమైన వైఖరిని వెల్లడించింది. ప్రధాని లోక్‌సభకు పోటీ చేసి గెలవాలని మన్మోహన్‌ను లక్ష్యంగా చేసుకుని భాజపా అగ్రనేత అద్వానీ పలుమార్లు విమర్శనాస్త్రాలు సంధించారు. తాము అధికారంలోకి వస్తే దీనిపై చర్చించి ఒక చట్టం కూడా చేస్తామని ఆయన ప్రకటించారు. తాజాగా ప్రకాష్ కారత్ కూడా అద్వానీతో ఏకీభవించడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో తృతీయ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వస్తే కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతు ఇవ్వాలని ఆయన సూచించారు. కాగా, తృతీయ కూటమి తరపున ప్రధాని అభ్యర్థిత్వంపై ఆయన మాట్లాడేందుకు నిరాకరించారు. |