ముంబయిపై గత ఏడాది జరిగిన తీవ్రవాద దాడి సందర్భంగా ప్రాణాలతో పట్టుబడిన మహ్మద్ అజ్మల్ అమిర్ కసబ్ వయసు గురించి మంగళవారం ప్రత్యేక కోర్టు విచారణ జరపనుంది. ముంబయిపై దాడి చేసిన సమయంలో తన వయసు కేవలం 17ఏళ్లు మాత్రమేనని అందుకే తనను బాలనేరస్థుల కోర్టులో విచారించాలంటూ కసబ్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో అతని వయసును నిర్ధారించే విచారణను ప్రత్యేక కోర్టు మంగళవారం చేపట్టనుంది.
ముంబయిలోని ఆర్థూర్ రోడ్డులో ఉన్న జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ కసబ్ కేసు విచారణను ప్రత్యేక కోర్టు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈనెల 24 జరిగిన విచారణ సందర్భంగా కసబ్ తరపున నియమించబడిన లాయర్ కజ్మి మాట్లాడుతూ ముంబయి దాడి సమయంలో కసబ్ మైనర్ అని వాదించారు. అందుకే కసబ్ వయసును నిర్థారించేందుకు పాక్‌కు వెళ్లాలని కూడా కజ్మి కోర్టును కోరారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ కసబ్ వయసు నిర్థారణ కోసం పాక్ వెళ్లాల్సిన పనిలేదని, వైద్య పరీక్షల ద్వారా అతని వయసు నిర్థారించాలంటూ జైలు అధికారులను ఆదేశించారు. అలాగే కసబ్ వయసును తెలుసుకునేందుకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను ఏప్రిల్ 28లోగా కోర్టుకు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. |