గుజరాత్ అల్లర్ల కేసులపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఎత్తివేసింది. అంతేకాకుండా 2002నాటి గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులపై విచారణ జరిపేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అల్లర్ల కేసులపై విచారణ జరిపేందుకు అహ్మదాబాద్, ఆనంద్, సబర్‌కాంతా, మెహ్సానా, గుల్‌బర్గా జిల్లాల్లో ఎనిమిది ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. న్యాయమూర్తి అరిజిత్ పసాయత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గుజరాత్ అల్లర్లపై ఏడేళ్లు గడిచినా విచారణ పూర్తికాకపోవడాన్ని గమనించింది. విచారణలో తీవ్ర జాప్యం జరిగినందున ఈ కేసులపై రోజువారీ విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అంతేకాకుండా కేసుల విచారణకు నిపుణులైన న్యాయవాదులను పబ్లిక్ ప్రాసిక్యూటర్లగా నియమించాలని గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించింది. గుజరాత్‌లోనే దీని కోసం ఎనిమిది ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని, రాష్ట్రం బయట ఈ కేసులపై విచారణ జరపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల విచారణ, సాక్షుల భద్రతపై హైకోర్టు పర్యవేక్షించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. |