తమ పార్టీ ఉత్తమ ప్రధానమంత్రి అభ్యర్థి మన్మోహన్ సింగేనని కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ మరోమారు స్పష్టం చేశారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఆయన నొక్కివక్కాణించారు. ప్రధాని అయ్యేందుకు అవసరమైన అన్ని లక్షణాలు రాహుల్ గాంధీకి ఉన్నాయని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.
దీనిపై రాహుల్ గాంధీ ఆదివారం తాను నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వివరణ ఇచ్చారు. భారత్-అమెరికా అణు ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో మన్మోహన్ పోషించిన కీలక పాత్ర పట్ల సోనియా పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా మన్మోహన్ పేరును సోనియా ప్రతిపాదించగా, రాహుల్ సమర్థించారు.
తాను, తన తల్లి అభిప్రాయం మేరకు.. ఉత్తమ ప్రధాని అభ్యర్థి మన్మోహన్ సింగ్ అని రాహుల్ అన్నారు. ఆయన మా అభ్యర్థి. ఆయన వెంట మేమంతా ఉన్నాం. ఇండో-యూఎస్ అణు ఒప్పందం సమయంలో దీన్ని నిరూపించాం అని రాహుల్ అన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మెర్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. మన్మోహన్ సింగే మా ప్రధాని. అలాగే యూపీఏ ప్రధాని కూడా అని వ్యాఖ్యానించారు. |