లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రభుత్వాలకు కూడా తాము మద్దతివ్వబోమని ఒరిస్సా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. వామపక్షాల నేతృత్వంలో మూడో కూటమి బలపడుతున్న తరుణంలో నవీన్ పట్నాయక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
భువనేశ్వర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా విలేకరులతో మాట్లాడిన నవీన్ పట్నాయక్ తన మనసులోని మాటను బయటపెట్టారు. అదేసమయంలో తమ పార్టీ మరోసారి ఒరిస్సాలో అధికారాన్ని చేపట్టగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కారత్‌తో భేటీ అనంతరం నవీన్ పట్నాయక్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం.
ఈ భేటీ సందర్భంగా ఎన్నికల అనంతరం బీజేడీతో పొత్తు విషయమై కారత్ మంతనాలు జరిపారు. ఈ కార్యక్రమం అనంతరం కారత్ మాట్లాడుతూ తమ భేటీ సందర్భంగా జరిగిన అంశాలను తెలిపారు. ఈ ఎన్నికల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలోని కూటములు అధికారంలోకి రాకుండా తాము ప్రయత్నాలు ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. అదేసమయంలో వచ్చే ఎన్నికల తర్వాత ఏపార్టీ కూడా స్పష్టమైన మెజారిటీ సాధించే అవకాశంలేదని కారత్ అభిప్రాయపడ్డారు. |