లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఓడించే సత్తా మాకుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌లను ఓడించే ప్రత్యామ్నాయ పార్టీ తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రకాశ్ కారత్ శుక్రవారం బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం ప్రకాశ్ కారత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌యేతర, బీజేపీయేతర కూటమి సాధ్యపడుతుందని చెప్పారు. బీజేడీ కూడా ఇదే అభిప్రాయంతో ఉందని వామపక్షాలు భావిస్తున్నాయన్నారు.
నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ... కాంగ్రెస్‌కు లేదా బీజేపీకి తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు.
తృతీయ కూటమి ప్రభుత్వానికి బయటి నుంచి కాంగ్రెస్ మద్దతు తీసుకునేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయని ఆయన అన్నారు.
కాగా ఈ ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ఆయన నిరాకరించారు. తమ పార్టీ మాత్రం బీజేపీ లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వదని పునరుద్ఘాటించారు. |