సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో తృతీయ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ జోస్యం చెప్పారు. ఆయన భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రభుత్వ ఏర్పాటులో బిజూ జనతాదళ్ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ కీలక పాత్ర పోషించగలరన్నారు.
నాలుగో దశ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పరిస్థితిపై మదింపు వేయగా రాజకీయ పార్టీలలో ఏ ఒక్కదానికీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదనిపిస్తోందన్నారు. కాంగ్రెస్, భాజపా యేతర పార్టీలు తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సూచనలే మెండుగా కనిపిస్తున్నాయని కారత్ అన్నారు.
ఒరిస్సాలో బీజేడీ తిరిగి అధికారంలోకి రాగలదని కారత్ ధీమా వ్యక్తం చేస్తూ, కేంద్రంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రభుత్వ స్థాపనలో నవీన్ ముఖ్య పాత్ర పోషించగలరని అన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించే అవకాశం లేదని కారత్ స్పష్టం చేస్తూ, తృతీయ ఫ్రంట్‌కు మద్దతు ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్, బీజేపీయేతర లౌకిక రాజకీయ పార్టీలన్నింటికీ ఆయన విజ్ఞప్తి చేశారు. |