కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై ఈనెల 16వ తేదీ తర్వాత వెల్లడిస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీతో భవిష్యత్ చెలిమికి నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇస్తారా అని ప్రశ్నించగా.. తొలుత ఎన్నికలు పూర్తి కావాలి. ఫలితాలు వెలువడాలి. మే 16వ తేదీ తర్వాత దీనిపై ఆలోచన చేస్తాం అని కారత్ సమాధానం ఇచ్చారు. కాంగ్రెసేతర పార్టీలతో కలిసి లెఫ్ట్ ప్రతిపాదిస్తున్న కూటమిలో జేడీయూ, ఎన్.సి.పి వంటి పార్టీలు చేరే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఫలితాల అనంతరం పొత్తుల్లో మార్పురావచ్చని చెప్పారు. తృతీయ కూటమి మద్దతుతో ఏ ఒక్క పార్టీ కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదనే విషయం సుస్పష్టమని కారత్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో మూడో కూటమి బాగా పని చేస్తోందన్నారు. బీఎస్పీనే తీసుకోండి. ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోందన్నారు. ఎన్నికల అనంతరం తామంతా ఒకతాటిపైకి వస్తామని కారత్ చెప్పారు. |