దేశ సరిహద్దుల వెంబడి పరిస్థితి ఏమాత్రం బాగాలేదని ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. స్వాత్ లోయలో మైనారిటీలపై జిజియా పన్ను విధించడం పట్ల పాకిస్థాన్ అధికారులతో తాము మాట్లాడుతున్నట్టు తెలిపారు. పాకిస్థాన్ వంటి మిత్రదేశాల్లో మైనారిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరి సమస్యల పరిష్కారానికి ఆయా దేశాలతో చర్చలు ప్రారంభించినట్టు చెప్పారు.
పొరుగు దేశంలో సిక్కులపై జిజియా పన్ను విధిస్తున్నారని, దీని అడ్డుకట్టకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారల మంత్రిత్వ శాఖ గత నెలలోనే పాక్ హైకమిషనరేట్ దృష్టికి సమస్యను తీసుకెళ్లిందన్నారు. అలాగే, పాక్‌లోని భారత హైకమిషనరేట్ కూడా పాక్ పాలకుల దృష్టికి తీసుకెళ్లిందని ఆయన తెలిపారు.
ఇకపోతే, దేశ సరిహద్దుల వెంబడి పరిస్థితి మంచిగా లేదన్నారు. దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. పొరుగు దేశాలతో భారత్ నిరంతరం స్నేహపూర్వక, సత్‌సంబంధాలను కోరుకుంటుందన్నారు. ఆర్థిక సంక్షోభ సమయంలో దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. |