భారతీయ జనతా పార్టీ యువనేత, ఫిలిబిత్ లోక్‌సభ అభ్యర్థి వరుణ్‌గాంధీపై జాతీయ భద్రతా చట్టం (నాసా)ను ప్రయోగించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. వరుణ్‌పై నాసాను ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తనపై నాసా ప్రయోగించడాన్ని సవాల్ చేస్తూ వరుణ్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం తన నిర్ణయాన్ని వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు వరుణ్‌పై నాసా ప్రయోగం సరికాదంటూ యూపీ రాష్ట్ర సలహా మండలి తీసుకున్న నిర్ణయాన్ని సైతం మాయావతి సర్కారు సవాల్ చేయరాదంటూ కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు వెలువడిన తరుణంలో వరుణ్‌పై ప్రయోగించిన నాసాను ఉపసంహరించుకున్నట్టు యూపీ ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. 29ఏళ్ల వరుణ్‌గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ నియోజకవర్గంనుంచి బీజేపీ తరపున లోక్‌సభ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం సందర్భంగా వరుణ్ ముస్లీం వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మార్చి 29న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆయనపై నాసాను ప్రయోగించింది. |