కేంద్రంలో హంగ్ తప్పదన్న సంకేతాలు రావడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి పట్టలేని సంతోషంతో ఉన్నట్లు సమాచారం. ఈ ఆనందాన్ని తృతీయ కూటమి నేతలతో పంచుకున్నారు. గురువారం కూటమి నాయకులను విందుకు ఆహ్వానించి మరీ వారితో సంతోషాన్ని పంచుకున్నారు. ఇక మిగిలినదల్లా శనివారం తమ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని ఎదురు చూడటమే.
ఎగ్జిట్ పోల్స్ అంతా ట్రాష్ అని ప్రధాన పార్టీలన్నీ కొట్టి పారేసినా, ఆ ఫలితాల తర్వాత పాత మిత్రులను దువ్వే పనిలో పడ్డాయి. ఈ వ్యవహారాన్ని మరింత నిశితంగా గమనించడానికి బీఎస్పీ చీఫ్ మాయావతి మిశ్రాను ఢిల్లీకి పంపించారు. పనిలోపనిగా తృతీయ కూటమి నేతల కదలికలను కూడా చూస్తుండమని పురమాయించినట్లు సమాచారం.
మరోవైపు తృతీయ కూటమిని అధికారంలోకి తేవాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇదిలావుంటే మాయవతిని కాంగ్రెస్ సహా ఎన్డీఏ నాయకులు సైతం ఫోనులో సంప్రదించినట్లు తెలుస్తోంది.
మే 16 తర్వాత మాత్రమే పొత్తులపై పూర్తిగా మాట్లాడలేనని మాయ అన్నట్లు సమచారం. అంతేకాదు తమ పార్టీ నేతలను సైతం ఫలితాలు వచ్చేవరకూ నోరు మెదప వద్దని హుకుం జారీ చేశారు. |