కేంద్రంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించనుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఈ అంశాన్ని భాజపా శిబిరం కొట్టి పారేసినా కొంత ఆందోళనలో ఉన్నట్లు సమచారం. ఎన్డీఏ ఆధ్వర్యంలో ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కమలనాధులు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు.
భాజపా కోర్ గ్రూప్ సభ్యులు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీసహా ఎల్కే అద్వానీ నివాసంలో సుమారు రెండు దఫాలు చర్చలు సాగించారు. మే 16 తర్వాత అనుసరించాల్సిన కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేశారు.
మెజారిటీ దక్కదని అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తేల్చేయడంతో పాతమిత్రులను ఎలాగైనా ఒప్పించే ప్రయత్నంలో భాజపా నాయకులు ఉన్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను తమ కూటమివైపు తిప్పుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. దూతగా నరేంద్ర మోడీని పంపించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. యూపీఎ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే కొన్ని పార్టీలు ఎన్డీఏతో కలిసి పనిచేయడానికి వస్తాయని భాజపా అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. టీవీ ఛానళ్ల ఎగ్జిట్ ఫలితాలను తాము విశ్వసించబోమనీ, తమ అంతర్గత లెక్కల ప్రకారం భాజపా సొంతగా కనీసం 166 స్థానాలను చేజిక్కించుకుంటుందనీ, తమ స్థానాలతో కలుపుకుని ఎన్డీఏ 218 సీట్లను దక్కించుకుంటుందని అన్నారు. |