బీహారుకు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన వారికే మద్దతు పలుకుతామని జనతాదళ్-యునైటెడ్ అధినేత నితీష్ కుమార్ కొత్త పల్లవి అందుకున్నారు. ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో తేలనున్న నేపథ్యంలో నితీష్ ఈ డిమాండ్‌ను చేశారు.
బీహారుకు ప్రత్యేక హోదా ఇస్తామని ఏ కూటమి చెపితే దానికి తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ఈ దిశగానే తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు.
బీహారు ప్రత్యేక హోదాపై గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తిరస్కరించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కనీసం ప్రత్యేక హోదాపై చర్చించడానికి కూడా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదన్నారు.
మూడేళ్ల క్రితం ఏప్రిల్ 13, 2006లో బీహారుకు ప్రత్యేక హోదా కావాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసిందనీ, ఈ విషయాన్ని తాము ప్రధాని మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అయితే దానిపై ఆయన చర్చించడానికి సుముఖత చూపలేదన్నారు. |