ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌తో జట్టుకట్టే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేశారు. అదేసమయంలో తాము ప్రస్తుతం ఎన్డీఏలోనే కొనసాగుతున్నామని, ఆ కూటమిని వీడి వెళ్లబోమని ఆయన పేర్కొన్నారు.
న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనమైన తరుణంలో శుక్రవారం విలేకరులతో కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల ఫలితాల అనంతరం 300 కంటే ఎక్కువ సీట్లు సాధించి ఎన్డీఏ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశగా తాము ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో ఎన్డీఏ మాత్రమే చిత్తశుద్ధితో ప్రవర్తిస్తోందని పేర్కొన్న ఆయన అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ప్రత్యేక రాష్ట్రం ఇస్తామంటూ ఆ కూటమి తమ మేనిఫెస్టోలో ప్రకటించడాన్ని గుర్తు చేశారు. |