బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ డిమాండ్‌కు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేక క్యాటగిరీ హోదా కింద ఆ రాష్ట్రానికి అభివృద్ధి నిధులు కేటాయించడానికి సిద్ధమేనని తెలిపింది.
భాజపా, శివసేన తప్ప దేశంలోని ఏ రాజకీయ పార్టీలైనా తమతో కలిసి పనిచేయవచ్చుననీ, అందరికీ ఆహ్వానం పలుకుతామని కాంగ్రెస్ నేత చతుర్వేది తెలిపారు.
నితీష్ డిమాండ్‌పై ఏదైనా ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉన్నదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు చతుర్వేది సమాధానమిస్తూ, ఈ దశలో ఏదీ కాదని చెప్పలేమనీ, అన్నిటికీ అంగీకరించాల్సిందేనన్నారు.
ఆర్జేడీ యూపీఏతో కలిసివుండగా నితీష్ జేడీ-యుతో కలిసి ఎలా వెళ్లగలరని అనుకుంటున్నారన్న ప్రశ్నకు చతుర్వేది స్పందిస్తూ, ఇంకా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదనీ, అయితే భాజపా- శివసేన తప్ప ఏ పార్టీ తమతో కలిసి వస్తామని చెప్పినా మాట్లాడేందుకు సిద్ధమన్నారు.
నితీష్ కుమార్ డిమాండ్‌పై మరింత స్పష్టమైన సమాధానమివ్వాలని విలేకరులు కోరగా చతుర్వేది మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాభివృద్ధిని ఆటంకపరచబోదన్నారు. ఒక రాష్ట్రంపై అతిప్రేమ, మరో రాష్ట్రంపై చిన్నచూపు చూడటం వంటి వివక్ష కూడా లేదన్నారు. ఏదేమైనా నితీష్ డిమాండ్‌ను కోర్ కమిటీలో చర్చిస్తామన్నారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ, బీహార్ రాష్ట్రానికి ఎన్డీఏ హయాంలోకంటే తమ హయాంలోనే అధిక నిధులు కేటాయించామన్నారు. |